అలా చేస్తే అమ్మాయిలే అత్యాచారాన్ని కోరుకున్నట్టు!: రాయ్ పూర్ సెంట్రల్ వర్శిటీ లేడీ ప్రొఫెసర్ వికృత బోధన!

  • విద్యార్థినీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చిన లేడీ ప్రొఫెసర్
  • పొట్టి దుస్తులు ధరించినా, అవయవాలు చూపినా రేప్ కు ఆహ్వానం పంపినట్టే
  • తప్పు అమ్మాయిలదేగానీ, అబ్బాయిలది కాదు
  • ప్రొఫెసర్ వ్యాఖ్యలపై కేసు నమోదు
రాయ్ పూర్ సెంట్రల్ యూనివర్శిటీలో బయాలజీ బోధించే ప్రొఫెసర్ ఒకరు అమ్మాయిల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ బోధించే స్నేహలతా శంఖ్వార్ అనే మహిళా టీచర్, విద్యార్థినీ, విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహిస్తూ, అమ్మాయిలు జీన్స్ వేసుకుని, లిప్ స్టిక్ పెట్టుకుంటే నిర్భయ వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.

అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే, అత్యాచారం చేయమని ఆహ్వానం పలికినట్టేనని అన్నారు. పొట్టి వస్త్రాలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు బయట తిరిగినా నిర్భయకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారని అభిప్రాయపడ్డ ఆమె, నిర్భయ అసలు ఓ అబ్బాయితో అంత రాత్రి వేళ ఎందుకు బయటకు వెళ్లిందని, ఇటువంటి పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.

తన ఉద్దేశంలో తప్పు నిర్భయే చేసిందని, అర్ధరాత్రి బయట తిరిగే అమ్మాయిల తప్పుంటుందే తప్ప అబ్బాయిల తప్పు కాదని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు అమ్మాయిలు చేసే పాపాలకు శిక్షని, తన శరీరాన్ని బయటకు చూపించే అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే అబ్బాయి భావిస్తాడని అన్నారు. అందమైన ముఖాలు లేని అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించవచ్చని ముక్తాయింపు ఇచ్చారు స్నేహలత. ఇక ఆమె వ్యాఖ్యలపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Go Back to Shorts
Raipur
Central University
Rape
Ladies
Short Dress
Lipstick

More Telugu News